Reel Buzz » News » ఐఏఎస్‌లకు, మంత్రులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం
ఐఏఎస్‌లకు, మంత్రులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం
* అవినీతికి బాధ్యులు మీరంటే మీరంటూ ఆరోపణలు
* ఐఏఎస్‌ల వైఖరిపై రాజకీయపక్షాల నుంచి మిశ్రమ స్పందన
* అధికారులు డూడూ బసవన్నలుగా ఉండొద్దంటున్న నేతలు
అంతా మీరే చేశారు. మాకు అధికారాలిచ్చారు.. కానీ వాటిని అమలులో పెట్టే లోపు మీరే నిర్ణయాలు తీసేసుకుంటారు. వాటి వల్ల ఏవైనా ఇబ్బందులొస్తే.. తప్పంతా మాపైకి నెడతారు.. ఇది ఏదో సినిమాలో డైలాగో కాదు.. రాష్ట్రంలో ఐఏఎస్‌లు మంత్రుల వ్యవహార శైలిపై చేస్తున్న ఆరోపణలు.
ఇంతకీ ఈ వ్యవహారంలో ఎవరిది తప్పన్నది.. ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశమైంది. కొంతమంది ఐఏఎస్‌లను సమర్థిస్తుంటే.. మరికొందరు.. మంత్రులను వెనకేసుకొస్తున్నారు. రాష్ట్రంలో మంత్రులకు, ఐఏఎస్ అధికారులకు మధ్య ప్రస్తుతం ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. రాష్ట్రంలో వెలుగుచూస్తున్న అవినీతి బాగోతాలకు కారణం మీరంటే.. మీరంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు సంధించుకుంటున్నారు.
సీబీఐ విచారణలో భాగంగా పలువురు ఐఏఎస్‌లను అరెస్టు చేయడంతో మొదలైన ఈ వివాదం... మునుపెన్నడూ లేని రీతిలో ఐఏఎస్‌లు మీడియా ముందుకు రావడంతో మరింత ముదిరింది... ఐఏఎస్‌లకు మంత్రులకు మధ్య నెలకొన్న ఈ వివాదంపై రాజకీయ పక్షాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. విశేష అధికారాలున్న ఐఏఎస్‌లు మంచీ చెడూ చూడకుండా సంతకాలు ఎలా చేస్తారనే ప్రశ్న అన్ని వర్గాల నుంచి వస్తున్నా.. దీని వెనక అసలు కారణం ఎవరన్న దానిపైనే భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మంత్రుల ప్రమేయంతోనే జీవోలు విడుదలవుతున్నాయన్నది అవాస్తవమని.. వారితో సంబంధం లేకుండా జీవోలు విడుదలైన సందర్భాలు అనేకం ఉన్నాయని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సీబీఐ విచారణతో అధికారులకు ఏమైనా ఇబ్బందులుంటే కోర్టుల దృష్టికి తీసుకెళ్లొచ్చని లగడపాటి సూచించారు.
అటు.. కోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్న సీబీఐ విచారణపై ఐఏఎస్‌లు ఆరోపణలు చేయడం తగదని రాజకీయ నాయకులు సూచిస్తున్నారు. అధికారులు నిజాయితిగా పనిచేస్తే ఎలాంటి స్కాంలకు అవకాశం ఉండదంటున్నారు. సీబీఐని ప్రశ్నించే బదులు తమపై ఒత్తిడి తెచ్చిన మంత్రులు, నేతల పేర్లను బయటపెట్టి అవినీతి అంతానికి సహకరించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మాత్రం అధికారుల ఆందోళనను సమర్థించింది. ఎమ్మార్ కుంభకోణంలో కేవలం IAS అధికారులనే బాధ్యులను చేయడం సరికాదని.. అప్పటి కేబినెట్ మొత్తాన్ని విచారించి చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేత పిల్లి సుభాష్‌చంద్రబోస్ డిమాండ్ చేశారు. IASలు కేవలం మంత్రిమండలి తీసుకున్న ముఖ్య నిర్ణయాలను మాత్రమే అమలు చేస్తారన్నారు.
మంత్రి మండలి నిర్ణయాలనే అమలు చేశామని.. తమకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారాలుండవని అధికారులు చెబుతుంటే... మంచీ చెడూ చూడకుండా గుడ్డి వ్యవహరించేందుకు ఇక ఐఏఎస్‌లే కావాలా అంటూ పలువురు రాజకీయ నేతలు సెటైర్లు వేస్తున్నారు. మొత్తం మీద... పరిపాలనకు మూల స్థంభాలైన పాలక, అధికార వర్గాల మధ్య వచ్చిన ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారి తీయనుందనేది ఆసక్తికరంగా మారింది.