తెలంగాణ వచ్చిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్దీకరిస్తామని చేస్తామని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు హామీయిచ్చారు. టీఆర్‌ఎస్ కార్యాలయంలో గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ర్టం తగ లబడుతున్న కొంపలా ఉందని వ్యాఖ్యానించారు. జూనియర్ వైద్యులు, 104 సిబ్బంది, వస్త్రా వ్యాపారులు, బీఈడీ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 84 రోజుల నుంచి 104 సిబ్బంది ఆందోళన చేస్తుంటే పట్టించుకునే నాథుడే లేడన్నారు. వైద్యశాఖ మంత్రి ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు.
ల్యాబ్ టెక్నీషియన్లకు మళ్లీ రాత పరీక్ష నిర్వహిస్తామనడం జోక్‌లా ఉందని కేసీఆర్ అన్నారు.104, 108 ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాస్తానని చెప్పారు. లక్ష ఉద్యోగాలిస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి కాంట్రాక్లు ఉద్యోగులను ఎందుకు క్రమబద్దీకరించరని నిలదీశారు. కాంట్రాక్టు కార్మికులతో గొడ్డు చాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించడం లేదని విమర్శించారు. మాట్లాడితే ఎస్మా పెడతానంటున్న కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎస్మా సీఎం అంటే సరిపోతుందన్నారు. తెలంగాణ సాధించడమే ఏకైక లక్ష్యమని కేసీఆర్ పునరుద్ఘాటించారు. త్వరలో ఉద్యమ కార్యాచరణ ఖరారు చేస్తామని తెలిపారు.