 |
* ప్రధాన ఆదాయ వనరుగా లిక్కర్
* కాసుల కోసం సర్కార్ కక్కుర్తి
* మరిన్ని మద్యం కంపెనీలకు అనుమతి
ఖజానా నింపుకోవడానికి సర్కార్ కొత్త ఎత్తులు వేస్తోంది. ప్రజలను మద్యం మత్తులో ముంచి కాసులు దండుకోవాలని చూస్తోంది. ఇందుకోసం కొత్త తరహా మద్యాన్ని ప్రవేశపెడుతోంది. గుట్టుచప్పుడు కాకుండా కొత్త మద్యం కంపేనీలకు అనుమతులిస్తోంది. దీనిపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. మద్యాన్ని నిర్మూలించాల్సిన సర్కార్ , లిక్కర్ వ్యాపారాన్ని ప్రొతహిస్తుందని వారు ఆరోపిస్తున్నారు.
మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా చూస్తోంది. ఖజానా నింపుకోవటానికి లిక్కర్ వ్యాపారాన్ని ప్రొత్సహిస్తోంది. కాని భారత రాజ్యంగం మాత్రం ఇది తప్పని చెబుతోంది. ఆదేశిక సూత్రాల్లోని 47వ అధికరణ సమాజ నిర్మాణం, వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలిగించే మత్తు పానీయాలను నిర్మూలించాలని సూచిస్తోంది.
అయితే గొప్పలకు పోయి బడ్జెట్ ను లక్ష కోట్లు దాటించిన సర్కార్ నిధుల కోసం ఎక్సైజ్ శాఖనే నమ్ముకుంది. బడ్జెట్ కేటాయింపులో భారాన్ని తగ్గించుకోవటానికి లిక్కర్ పై పడింది. అధికారులకు టార్గెట్ పెట్టి మరీ విక్రయాలను పెంచుతోంది. దీంతో ఖజానాకు మద్యం ద్వారా వచ్చే రాబడి గణనీయంగా పెరుగుతోంది.
1999-2000 ఆర్థిక సంవత్సరంలో మద్యం ద్వారా ప్రభుత్వానికి 2583 కోట్ల రూపాయల ఆదాయం రాగా ......2011-12 ఆర్థిక సంవత్సరం నాటికి అది 8 రెట్లు పెరిగి 17,500 కోట్లకు చేరింది. అయినా బడ్జెట్ లక్ష్యాన్ని చేరేందుకు తంటాలు పడుతున్న ప్రభుత్వం, మద్యాన్ని ఏరులై పారించి రాబడి పెంచుకోవాలని చూస్తోంది. ఇప్పటికే మద్యం ఉత్పత్తి కోటాను పెంచి విమర్శలు ఎదుర్కున్న ప్రభుత్వం, కొత్త పేర్లు పెట్టి అదనపు ఉత్పత్తులకు అనుమతినిస్తోంది.
తాజాగా ఈ నెల 24న తక్కువ ఆల్కహాల్ ఉండే మద్యం పేరుతో 20వేల కేసులఉత్పత్తికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం జీవో నంబరు 151 విడుదల చేసింది. స్ల్పాష్ కంపెనీ తయారు చేసే ఈ మందులో ఆల్కహాల్ శాతం అయిదు కంటే తక్కువుగా ఉంటుందని చెబుతోంది. దీనిపై మేథావివర్గం మండిపడుతోంది.
ఆదాయం కోసమే ప్రభుత్వం ఈ తరహా చర్యలకు ఉపక్రమిస్తోందని వారు ఆరోపిస్తున్నారు.మరోవైపు పరిస్థితి ఇలానే కొనసాగితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టనున్న రికార్డు బడ్జెట్‌ను సాధించేందుకు మద్యం దుకాణాలను బార్లా తెరిచినా ఆశ్చర్యం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.