ఉపఎన్నికల్లో తెలంగాణ ఆత్మగౌరవ నినాదం చాటాలని టీఆర్‌ఎస్ పార్టీ శాసన సభాపక్ష నేత ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికలే ప్రధాన ఎజెండాగా చర్చించినట్లు ఈటెల తెలిపారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు పాలమూరు జిల్లాల్లోని మూడు నియోజకవర్గాల్లో పల్లెబాట కార్యక్రమం ఉంటుందని, ప్రతి వంద ఓటర్లకు ఒకరు చొప్పున కార్యకర్తలు పల్లెల్లో తిరుగుతారని ఆయన వెల్లడించారు. 29 వరకు ప్రతి పల్లె తిరుగుతామని చెప్పారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీలకు డిపాజిట్లు గల్లంతవడం ఖాయమని, ప్రజాక్ష్రేత్రంలోనే తెలంగాణ ద్రోహులకు బుది చెబుతామని ఈటెల స్ఫష్టం చేశారు. ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ప్రతి మండల కేంద్రంలో విజయశాంతి ఆధ్వర్యంలో సభ ఉంటుందని, మార్చి 5 నుంచి 9 వరకు ఈ సభలు కొనసాగుతాయని, మార్చి 10న నాగర్ కర్నూల్‌లో భారీ బహిరంగ సభ ఉంటుందని, ఈ సభకు కేసీఆర్‌తోపాటు పార్టీ నేతలందరూ పాల్గొంటారని ఈటెల వివరించారు. ఇదే రేంజ్‌లో మార్చి 11న ఆదిలాబాద్‌లో బహిరంగ సభ ఉంటుందని ఆయన చెప్పారు. పాలమూరులో కేసీఆర్ 3 రోజులపాటు మకాం వేస్తారని ఆయన అన్నారు.