టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేశారని ఆరోపించారు. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజా సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రైతులకు ఎరువులు కూడా ఇవ్వలేని హీనస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.
రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ప్రజలు పన్నుపోటుతో చితికి పోతున్నారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గల్లంతు కావటం ఖాయమన్నారు. కాగా చంద్రబాబు ప్రయోగిస్తున్న భాష అభ్యంతరకరంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అభ్యంతరం తెలిపారు.