దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడుస్తోందని బీసీ సదస్సు మండిపడింది. హైదరాబాద్ జూబ్లీ హాల్లో జరిగిన బీసీ కులాల సమ్మేళనానికి వివిధ సంఘాల నేతలతోపాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, బస్వరాజు సారయ్యలు పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్ ప్రభుత్వ హయంలో ఏర్పాటైన బీసీ ఫెడరేషన్‌ను ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని బీజీ కుల సంఘాల నేతలు తప్పుపట్టారు. నేతల డిమాండ్లకు మంత్రి సారయ్య, పీసీసీ చీఫ్ బొత్సలు స్పందించారు.
వచ్చే బడ్జెట్‌లో ఫెడరేషన్‌లకు నిధులివ్వాలని సీఎంను కోరుతామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు మాదిరిగానే.. బీసీలకు కూడా సబ్ ప్లాన్ ఉండాలన్న సదస్సు డిమాండ్‌ను కూడా గతంలోనే సీఎం దృష్టికి తీసుకెళ్లామని బొత్స తెలిపారు. డిమాండ్ల సాధనకు పోరాడాలని బీసీలు పిలుపునిచ్చారు.