వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల కోసం రూ. 3 వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయనను శుక్రవారం ఉప్పాలగుప్త మండలానికి చెందిన రైతు సంక్షేమ సంఘం నేతలు కలుసుకున్నారు.
కోనసీమలో పంట విరామంపై వివరించారు. తమ గోడును పట్టించుకోవడం లేదని రైతులు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు. రైతు పట్ల వివక్ష ఇలాగే కొనసాగితే రైతు భార్యల మెడలోని పసుపుతాళ్లు ఉరితాళ్లవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలు చెప్పిన కష్టాల్ని ఆద్యంతం విన్న జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కష్టాలు గట్టెక్కుతాయని రైతులకు భరోసా ఇచ్చారు.