చిరంజీవి తనయుడు రాంచరణ్ తేజ, తన మనవరాలు ఉపాసనల వివాహం జూన్ 13న జరుగుతుందని అపోలో ఆస్పత్రుల అధినేత ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. మంగళవారం టీ టీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులతో కలసి ప్రతాప్‌రెడ్డి దంపతులు శ్రీవారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. రాంచరణ్, ఉపాసనల వివాహానికి ఇరువురి బంధువులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.
చిరంజీవి తరఫున తిరుపతి, తమ తరఫున అరగొండలో రిసెప్షన్ నిర్వహిస్తామన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అశ్వినీ ఆస్పత్రిలో 15 నెలల కిందట ఏర్పాటు చేసిన అపోలో అత్యవసర చికిత్సా కేంద్రం ద్వారా 1,300 మందికి గుండె సంబంధిత చికిత్స అందించామని ప్రతాప్‌రెడ్డి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో చెన్నై కేంద్రంగా టెలీ-మెడిసిన్ సహకారం అందించేందుకు ప్రత్యేకంగా అంబులెన్స్ సర్వీసు ఏర్పాటు చేశామన్నారు.