రథసప్తమిని పురస్కరించుకుని తిరుమల కొండ భక్తులతో పోటెత్తింది. ఒకే రోజు ఏడు వాహనాలపై ఊరేగనున్న స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఉదయం 5.30 గంటలకు శ్రీదేవి , భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై ఊరేగారు.
అయితే ప్రతి ఏడాది స్వామి వారి పాదాలను సూర్య కిరణాలు తాకిన తర్వాతే వాహన సేవ ప్రారంభమవుతుంది. కానీ ఇవాళ దట్టమైన పొగమంచు కారణంగా భానుడి కిరణాలు స్వామి పాదాలు తాకలేదు. దీంతో భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. గంటన్నర వేచి వుండి ఊరేగింపు మొదలెట్టారు. ప్రస్తుతం స్వామి వారు చినశేష వాహనంపై ఊరేగుతున్నారు. సూర్య కిరణాలు తాకకుండానే రథాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లటంపై ఈవో వివరణ ఇస్తూ ఆగమ శాస్త్ర పండితుల సలహా మేరకే స్వామివారి రథాన్ని ఊరేగిస్తున్నట్లు తెలిపారు.